మహిళా మత్స్యకార్మికులకు ఉపాధి లక్ష్యంగా..చేపల ప్రాసెసింగ్ యూనిట్లు 

మహిళా మత్స్యకార్మికులకు ఉపాధి లక్ష్యంగా..చేపల ప్రాసెసింగ్ యూనిట్లు 
  • గోదావరి నది సమీపంలో ఏర్పాట్లు
  • ‘ఆపరేషన్ ఫర్ ఫిషర్ వుమెన్’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం
  • మార్కెటింగ్ బాధ్యతలు డీఆర్డీవోకు
  • ప్రాసెసింగ్ వ్యర్థాల నుంచి ఎమినో ఆసిడ్ ఉత్పత్తి
  •  గోదావరి నది సమీపంలో ఏర్పాట్లు
  • ‘ఆపరేషన్ ఫర్ ఫిషర్ వుమెన్’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం
  • మార్కెటింగ్ బాధ్యతలు డీఆర్డీవోకు
  • ప్రాసెసింగ్ వ్యర్థాల నుంచి ఎమినో ఆసిడ్ ఉత్పత్తి 

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని గోదావరి నదిలో చేపల వేటపై జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు మరింత ఉపాధి, మార్కెటింగ్, ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కలెక్టర్ భవేశ్​ మిశ్రా ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ ఫర్ ఫిషర్ వుమెన్’ పేరుతో అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మత్స్యకార కుటుంబాల్లోని మహిళ ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు.

వర్క్ ఫర్ ఫిషర్ ఉమెన్’ పేరుతో..

ప్రస్తుతం గోదావరిలో పట్టిన చేపలను మత్స్యకార మహిళలు స్థానిక మార్కెట్​లోనే అమ్మకుండా ప్రాసెసింగ్ చేసి వాటిని ప్రత్యేకంగా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాసెసింగ్ కోసం గోదావరి నది పరివాహకాల్లో ప్రత్యేకంగా ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మిస్తున్నారు. సోన్ వద్ద 100 మత్స్యకార కుటుంబాల కోసం రూ.6 లక్షలతో ప్రత్యేకంగా షెడ్ నిర్మించారు. ‘వర్క్ ఫర్ ఫిషర్ ఉమెన్’ పేరుతో నిర్మించిన ఈ షెడ్​లో చేపలను పూర్తిస్థాయిలో ప్రాసెసింగ్ చేయనున్నారు. ఇలా ప్రాసెసింగ్ అయిన చేప ముక్కలను సూపర్ మార్కెట్లలోనే కాకుండా, ఇతర జిల్లాలకు, మహారాష్ట్ర సైతం ఎగుమతి చేయాలని నిర్ణయించారు. మత్స్యశాఖ, డీఆర్డీవో ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందిస్తున్నారు.

లిక్విడ్ వేస్టేజ్​తో ఎమినో యాసిడ్ ఉత్పత్తి

ప్రాసెసింగ్ యూనిట్లలో చేపలను శుభ్రం చేసిన అనంతరం వెలువడే లిక్విడ్ వేస్టేజ్ తో ఎమినో యాసిడ్ ను తయారు చేయాలని నిర్ణయించారు. ప్రతిరోజు చేపలను శుభ్రం చేయడం ద్వారా పెద్ద మొత్తంలో లిక్విడ్ వేస్టేజీ లభిస్తుంది. ఈ వేస్టేజీతో యూనిట్లలోనే ఏమినో యాసిడ్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు మహిళా మత్స్యకార కుటుంబ సభ్యులకు డీఆర్డీవో శిక్షణ ఇవ్వనుంది. ఆధునిక పద్ధతుల్లో చేపలను ప్రాసెసింగ్ చేయడం, యాసిడ్ ను ఉత్పత్తి చేసి, నిల్వ చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

సేంద్రియ ఎరువుగా ఎమినో యాసిడ్

చేపల ప్రాసెసింగ్ నుంచి వెలువడే లిక్విడ్ వేస్టేజ్ తో తయారయ్యే ఎమినో యాసిడ్ ను పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగిస్తాం. ఎమినో యాసిడ్ తో పంటలు మంచి దిగుబడి ఇస్తాయి. భూసారం పెరుగుతుంది. సహజసిద్ధంగా తయారయ్యే ఈ యాసిడ్ పంటల ఎదుగుదలకు ఎంతో మేలుచేస్తుంది. చీడపీడలను నివారిస్తుంది.- విజయలక్ష్మి, డీఆర్డీవో పీడీ, నిర్మల్